భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గేట్ వద్ద బీఆర్ఎస్ నేతలతో కలిసి రైతులు నేషనల్ హైవే 765డీపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ బోర్లు, మోటార్లపై ఆధారపడి సాగు చేస్తున్న తమకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలకు సకాలంలో నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు తమను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని రైతులు తెలిపారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో పంటలకు నీరు ఎలా అందించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటేనే పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతులు, బీఆర్ఎస్ నేతలు హైవేపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న నర్సాపూర్ సీఐ రంగాకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులు, బీఆర్ఎస్ నేతలను సముదాయించారు. హైవేపై ఆందోళన కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున రాస్తారోకో విరమించాలని కోరారు.
అయితే విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాల్సిందేనని రైతులు, బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమది రాజకీయ సమస్య కాదని, సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్డెక్కామని రైతులు పేర్కొన్నారు. విద్యుత్ కోతల సమస్యకు తక్షణమే పరిష్కారం చూపడంతో పాటు పంటలకు అవసరమైన మేర నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.