భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

కోతుల బెడద నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: కలెక్టర్

కోతుల బెడద నుంచి ప్రజలకు, రైతులకు ఉపశమనం కల్పించే దిశగా మున్సిపల్ కమిషనర్స్ పటిష్ట చర్యలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో కోతుల బెడద నుంచి ప్రజలు, రైతులకు ఉపశమనం కల్పించేలా మున్సిపల్ కమిషనర్లు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 6,500 కోతులు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కోతుల కారణంగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణను అమలు చేయాలని పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి నర్సాపూర్, తూప్రాన్, మెదక్, రామాయంపేట మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించి కోతుల బెడద నియంత్రణపై సమీక్షించారు. గత సమావేశంలో సూచించిన అంశాలపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నివేదికల ప్రకారం మెదక్‌లో సుమారు 3,000, నర్సాపూర్‌లో 2,000, తూప్రాన్‌లో 1,000, రామాయంపేటలో 500 కోతులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

కోతుల నియంత్రణ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. కోతులను పట్టుకుని నిర్మల్ జిల్లాకు తరలించి, అవసరమైన ఆపరేషన్లు నిర్వహించిన అనంతరం అక్కడే వదిలే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దశలవారీగా సమర్థవంతంగా అమలు చేస్తే జిల్లాలో కోతుల బెడదను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు, రైతులకు త్వరితగతిన ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కోతుల నియంత్రణ చర్యలను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల సహకారం అవసరమని కలెక్టర్ అన్నారు. మెదక్ జిల్లాను కోతుల నియంత్రణలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన కార్యాచరణను నిరంతరం కొనసాగించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్‌ఓ జోజి, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.