భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జామ్ల తండాలో వైరల్ జ్వరాలు ప్రబలడంతో ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు జామ్ల తండాలో పలువురు జ్వరాల బారిన పడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ వెంటనే ఇనుగుర్తి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వైద్యాధికారి ఆదేశాల మేరకు శుక్రవారం వైద్య సిబ్బంది తండాను సందర్శించి జ్వర బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
తండాలో మొత్తం 40 మంది జ్వర బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్య సిబ్బంది అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వాతావరణ పరిస్థితుల మార్పు లేదా ఇతర కారణాలతో తండాలో పలువురు జ్వరాల బారిన పడుతున్నారని సర్పంచి బిక్షపతి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ జ్వరాలతో బాధపడుతున్న తండా ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమస్యను వైద్యాధికారి డాక్టర్ సురేష్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి వైద్య సిబ్బందిని పంపి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందజేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. తండాలో జ్వరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్య సిబ్బంది మళ్లీ మళ్లీ తండాను సందర్శించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తండాలో వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య సిబ్బంది చేపట్టిన చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని గ్రామస్థులు కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచి ఇస్లావత్ బాబు, పంచాయతీ కార్యదర్శి రమణమూర్తి, ఏఎన్ఎం మంజుల, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జ్వరాల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్య సిబ్బంది సూచించారు.