భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

సింఫనీ హోమ్స్‌ 22-ఏపై అపోహలు వద్దు: నర్సింహారెడ్డి

సింఫనీ హోమ్స్‌ 22-ఏపై అపోహలు వద్దు: నర్సింహారెడ్డి

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సింఫనీ హోమ్స్‌ కాలనీకి సంబంధించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సంగారెడ్డి జిల్లా INTUC, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి అన్నారు. సింఫనీ హోమ్స్‌ కాలనీ 55 ఎకరాల్లో నిర్మించిన 900 విల్లాలను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ అంశంపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని కోరుతూ శుక్రవారం పటాన్‌చెరు తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ సింఫనీ హోమ్స్‌ కాలనీకి సంబంధించి 900 విల్లాలను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం 4 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమిని మాత్రమే రైల్వే లైన్‌ నిర్మాణం కోసం సేకరించినట్లు పేర్కొన్నారు. ఆ భూమిని 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చినట్లు అధికారులు స్పష్టం చేశారని తెలిపారు. దీనిని మొత్తం కాలనీకి వర్తింపజేసినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వ భూములను, ముఖ్యంగా రైల్వే అవసరాల కోసం కేటాయించిన భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని నర్సింహారెడ్డి అన్నారు. రైల్వే భూమిని కాపాడేందుకు మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాలను పరిశీలించకుండా రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన అయోమయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అధికారిక రికార్డులు, సంబంధిత శాఖల వివరాల ఆధారంగా మాత్రమే ఈ అంశంపై మాట్లాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం సింఫనీ హోమ్స్‌ అంశంపై అధికారులు వెల్లడించిన వివరాలను ప్రజలకు తెలియజేశారు. 22-ఏ నిషేధిత జాబితా విషయంలో వాస్తవ పరిస్థితులను స్పష్టంగా వెల్లడించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని వారు కోరారు. రైల్వే కోసం సేకరించిన ప్రభుత్వ భూమి పరిరక్షణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.