భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన రద్దయిందని సీపీఐ వలిగొండ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్ అన్నారు. పటేల్ సైనిక చర్య వల్ల మాత్రమే నిజాం పాలన అంతం కాలేదని ఆయన పేర్కొన్నారు. వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులైన కామ్రేడ్లు పులిపలుపుల రామ లక్ష్మయ్య, కేశిరెడ్డి అనంతరెడ్డి, నీలం చెన్నయ్య, కాడిగళ్ల సాయిలు, ఎం.డి. ఖాజామైనుద్దీన్ల అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగం సాగించిన సాయుధ పోరాటం చరిత్రలో మహత్తర పోరాటంగా నిలిచిందన్నారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ తదితరుల పిలుపుతో ఉద్యమం విస్తరించిందని తెలిపారు. నాటి పరిస్థితుల్లో రైతులు, పేదలు ఎదుర్కొన్న దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు నాలుగు వేల మంది అమరులయ్యారని మహేష్ తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటం ద్వారా సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, వేలాది గ్రామాలను విముక్తి చేశారని పేర్కొన్నారు. ఈ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అమరవీరుల జీవిత చరిత్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు పోలేపాక యాదయ్య, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు మారోజు నరసింహాచారి, గ్రామ శాఖ కార్యదర్శి పులిపలుపుల మల్లేశం పాల్గొన్నారు. అలాగే తాలూకా యాదగిరి, చంద్రగిరి చంద్రయ్య, బుంగ చక్రపాణి, తాలూకా నర్సమ్మ, కాడిగళ్ల పెంటయ్య తదితరులు హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. సాయుధ పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.