భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని కిర్బి పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థలోని షేరింగ్ విభాగంలో పనిచేసిన కె. శంకర్‌రావు అనారోగ్యంతో మే నెలలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి సంస్థ, కార్మిక సంఘం తరఫున అండగా నిలిచేందుకు డెత్ రిలీఫ్ ఫండ్‌ను అందజేశారు. ఈ మేరకు రూ.33,59,712 విలువైన చెక్కును శంకర్‌రావు కుటుంబ సభ్యులకు అందించారు.
కిర్బి హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ రాజమహేంద్ర, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ కలిసి డెత్ రిలీఫ్ ఫండ్ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా శంకర్‌రావు కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, సంస్థ, కార్మిక సంఘం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్మికులు ఎదుర్కొనే సమస్యలు, కుటుంబాలకు వచ్చే ఇబ్బందుల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్మికుల హక్కులతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కిర్బి పరిశ్రమకు చెందిన అధికారులు, హెచ్‌ఆర్ విభాగం ప్రతినిధులు, యూనియన్ నాయకులు, కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శంకర్‌రావు కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ అందించడం ద్వారా సంస్థ, కార్మిక సంఘం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక సహాయం కుటుంబానికి కొంత మేర ఉపశమనం కలిగిస్తుందని వారు తెలిపారు.