భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

మట్టి గణపతుల తయారీలో విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ

భళా.! విజ్ఞాన్ విద్యార్థుల కళ.. మట్టి విగ్రహాలను తయారు చేసిన బాల బాలికలు.. గ్రామస్తులకు అందజేసిన విజ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలనే సందేశాన్ని ఇనుగుర్తి మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు తమ సృజనాత్మకతతో చాటిచెప్పారు. వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల యాజమాన్యం సూచన మేరకు బాలబాలికలు మట్టితో గణనాథుల విగ్రహాలను తయారు చేశారు. రసాయనిక పదార్థాలతో తయారయ్యే విగ్రహాల వల్ల పర్యావరణానికి, జలచరాలకు కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

విద్యార్థులు స్వయంగా మట్టితో వివిధ ఆకృతుల్లో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను చూసిన పాఠశాల ప్రిన్సిపాల్ గంజి అర్చన రెడ్డి వారిని అభినందించారు. చిన్న వయస్సులోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా మరింత సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని తెలిపారు.

మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. ప్రకృతి సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసే విగ్రహాలను పూజించడం సంప్రదాయంలో భాగమని తెలిపారు. మట్టి విగ్రహాలు నిమజ్జనం చేసిన అనంతరం నీటిలో సులభంగా కరిగిపోతాయని, రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటిలోని చేపలు, ఇతర జలచరాలకు హాని కలిగే అవకాశం ఉందని వివరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని సూచించారు.

అనంతరం విద్యార్థులు తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను గ్రామస్తులకు ఉచితంగా అందజేశారు. పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు తమ వంతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెనగండ్ల చంద్రమోహన్, తోట అనిత, బోళ్ల సుజాత, కారంపూరి అనూష, కదిరే రమ్య, ఉడత శ్వేత, గండి రమ్య, గుండ్రపల్లి స్రవంతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.