భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నెల్లికుదురులో ముగిసిన SGF క్రీడా పోటీలు

నెల్లికుదురులో ముగిసిన ఎస్జిఎఫ్ క్రీడా పోటీలు..  జోన్ స్థాయికి 144 మంది బాల బాలికలు ఎంపిక..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయంలో మండల స్థాయి 70వ SGF ఖో-ఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీల ఎంపికలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ఎంఈఓ ఆంగోతు రాందాస్ తదితరులు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని ఎంఈఓ ఆంగోతు రాందాస్ తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జాతీయ సమైక్యత వంటి స్ఫూర్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో నెల్లికుదురు మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది బాలబాలికలు క్రీడాకారులుగా పాల్గొన్నట్లు పోటీల మండల కన్వీనర్ ఎస్. ప్రవీణ్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ చెడుపల్లి ఐలయ్య తెలిపారు. ఖో-ఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఇందులో మొత్తం 144 మంది బాలబాలికలను జోన్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

జోన్ స్థాయికి ఎంపికైన 144 మంది క్రీడాకారులు త్వరలో కేసముద్రం మండలం పెనుగొండ హైస్కూల్‌లో నిర్వహించనున్న జోన్ స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు ఎండీ ఇమామ్, కొమురయ్య, శ్రీనివాసు, వనిత తదితరులు పాల్గొన్నారు.