భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీసుల సూచనలు

గణేష్ ఉత్సవాల నిర్వహణ పై  సమావేశం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, గణేష్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్సై వివరించారు.

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై సూచించారు. ఇందుకోసం పోలీస్ శాఖకు చెందిన గణేష్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో నిబంధనలు పాటిస్తూ పోలీసుల సూచనలకు అనుగుణంగా మండపాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని, విద్యుత్ వైర్లను సురక్షితంగా అమర్చాలని సూచించారు.

మండపాల వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు సరైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మండపాల పరిసరాల్లో మద్యం సేవించవద్దని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా పార్కింగ్‌ను క్రమబద్ధీకరించి, రహదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మండపాల వద్ద అనుమానిత వ్యక్తులు కనిపించినా, ఏదైనా భద్రతాపరమైన సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై గంగారపు కరుణాకర్ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.