భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భూదానోద్యమ పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే ఆశయాలను నేటి తరాలు కొనసాగించాలని తెలంగాణ సర్వోదయ మండల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అందోల్ నియోజకవర్గ ఇంచార్జ్ గాజుల అనిల్ కుమార్ అన్నారు. వినోబా భావే 131వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోబా భావే సేవలను స్మరించుకున్నారు.
గాజుల అనిల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల ప్రయోజనాల కోసం వినోబా భావే సుమారు 14 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారని తెలిపారు. భూదానోద్యమం ద్వారా భూస్వాముల నుంచి భూములను సేకరించి భూమిలేని పేదలకు అందించేందుకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సేవాభావం, గ్రామీణ అభివృద్ధి వంటి విలువలను పెంపొందించడమే వినోబా భావే లక్ష్యమని అన్నారు.
వినోబా భావే భూదానోద్యమం ద్వారా సేకరించిన భూముల్లో కొంత భాగం ఇప్పటికీ పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందకపోవడం, ఆక్రమణలకు గురవుతున్నట్లు ఆరోపణలు రావడం దురదృష్టకరమని అనిల్ కుమార్ అన్నారు. భూదానోద్యమం స్ఫూర్తిని కాపాడేందుకు సంబంధిత భూములను గుర్తించి అర్హులైన పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినోబా భావే చూపిన మార్గంలో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో భూదాన్ మండల నాయకులు చిరంజీవి, ధార్మిక సేవా సమితి సభ్యులు కరునేశ్వర్, పల్లె రమేష్, మణికంఠ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వినోబా భావే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.