భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 19 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులే భావి భారత నిర్మాతలని అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, విద్యా నైపుణ్యాలను పెంపొందిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు.
సభాధ్యక్షత వహించిన మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఉపాధ్యాయులందరూ ఉత్తములేనని పేర్కొంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన కొనసాగుతోందని, ఉపాధ్యాయులు ఆంగ్లంలో విద్యార్థులకు చక్కగా బోధిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని కొనియాడారు.
డిప్యూటీ తహసీల్దార్ నవీన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి ఉపాధ్యాయుడు మరింత బాధ్యతతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాధిక, రఘునందన్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మండల విద్యాధికారి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.