భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురు ఎమ్మార్సీలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సిఆర్పి)గా విధులు నిర్వహిస్తున్న బైరు కవితకు ఇటీవల జరిగిన గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఉత్తమ పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు ఎంఈఓ ఆంగోతు రాందాస్ స్థానిక గవర్నమెంట్ హైస్కూల్లో నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో కవితను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెమెంటో, ప్రశంసాపత్రంతో పాటు ఉత్తమ పురస్కారాన్ని అందజేశారు.
ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన బైరు కవిత 2012 నుంచి విద్యాశాఖలో సిఆర్పిగా విశేష సేవలు అందిస్తున్నారు. తొలుత రాజుల కొత్తపల్లి క్లస్టర్లో సిఆర్పిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం మేచరాజుపల్లి హైస్కూల్ కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు డీఈఓ, ఎంఈఓల ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, విద్యాసంబంధిత అంశాలను కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు.
అదేవిధంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సహాయకురాలిగా ఉంటూ, పాఠశాలలకు సంబంధించిన వివిధ విద్యా కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన విద్యాశాఖ అధికారులు నెల్లికుదురు మండల స్థాయిలో ఉత్తమ సిఆర్పిగా ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డు గ్రహీత సిఆర్పి కవిత మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సహకారంతోనే సిఆర్పిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని తెలిపారు. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అదే సమయంలో తనపై మరింత బాధ్యత పెరిగిందని వినమ్రతతో పేర్కొన్నారు.
కాంప్లెక్స్‌లో కవితకు ఘన సన్మానం..
నెల్లికుదురు మండల స్థాయిలో ఉత్తమ సిఆర్పిగా ఎంపికై అవార్డు అందుకున్న బైరు కవితను ఆమె సిఆర్పిగా విధులు నిర్వర్తిస్తున్న మేచరాజుపల్లి జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ఉపాధ్యాయులు కవితను అభినందిస్తూ, విద్యారంగంలో ఆమె అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్‌లో మరెన్నో పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.