భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: హైదరాబాద్లోని కోఠి బీసీసీఈ భవన్లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీకి చెందిన జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టీఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు.
ఏ రంగంలో ఉన్నా కులవివక్ష తప్పడం లేదని, జర్నలిజం రంగంలోనూ చిన్న, పెద్ద పత్రికల పేరుతో వివక్ష చూపుతూ జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి టీఎంజేఎఫ్ ధిక్కార స్వరంగా నిలుస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వారికి అండగా నిలిచేందుకు ఫోరం కృషి చేస్తోందని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
మహాసభలకు బయలుదేరిన వారిలో తిరుమలగిరి టీఎంజేఎఫ్ మండల అధ్యక్షుడు బాకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిర్మాళ్ల బాలకృష్ణ, దర్శనం శేఖర్, జోసెఫ్ తదితరులు ఉన్నారు.