భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మట్టి గణేష్‌ను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణేష్ ను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నర్సాపూర్ సీఐ రంగ కృష్ణ, ఎస్‌ఐ రంజిత్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సాపూర్ మండలానికి చెందిన గిరిదీపం ప్రైవేట్ హైస్కూల్‌కు చెందిన సుమారు 125 మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ మోసిన్ నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రంగ కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

మట్టి గణేష్ ను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

అనంతరం 101 చిన్న మట్టి గణేష్ విగ్రహాలను విద్యార్థులకు అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్, ఇతర పర్యావరణానికి హానికరమైన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవడంతో పాటు పర్యావరణానికి నష్టం జరుగుతుందని పోలీసులు వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి గణేష్ విగ్రహాలను ఉపయోగించి వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

“మట్టి గణేష్‌ను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే సందేశంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువతలో పర్యావరణ పరిరక్షణపై బాధ్యత పెరగడమే కాకుండా, సమాజంలో పర్యావరణహితమైన వినాయక చవితి నిర్వహణకు ప్రోత్సాహం లభిస్తుందని పోలీసులు తెలిపారు.