భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: అక్రమంగా తరలిస్తున్న 324 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని రాజపేట పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అక్రమ రవాణా, నిల్వలు, పీడీఎస్ బియ్యం దుర్వినియోగంపై కొనసాగుతున్న నిఘాలో భాగంగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజపేట పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా రాజపేట మండలం సింగారం గ్రామం వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని పోలీసులు ఆపి తనిఖీ చేయగా అందులో 324 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణలో పుట్టగూడెం గ్రామానికి చెందిన భూక్యా దేవి సింగ్ సహాయంతో బియ్యాన్ని సిద్దిపేట వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన లారీ రిజిస్ట్రేషన్ నంబర్ GJ-37-V-8666గా పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి రాజపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో భూక్యా దేవి సింగ్, కటార ఆవడ బాలు, మోరీ సమీర్ జేతలను నిందితులుగా పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణాకు సంబంధించిన మరిన్ని వివరాలను దర్యాప్తులో వెల్లడించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, నిల్వ చేసినా లేదా అక్రమ వ్యాపారానికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రాజపేట ఎస్ఐ హెచ్చరించారు. పీడీఎస్ వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిపై జిల్లా పోలీస్ శాఖ జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.