భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

హామీ నెరవేర్చిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం..

హామీనెరవేర్చిన ఎమ్మెల్యే కు రుణపడి ఉంటాం..              నెల్లికుదురు రామన్నగూడెం రైతులు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కర్షకుల కష్టాలు తీర్చేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మడమ తిప్పకుండా నెరవేర్చిన ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్‌కు రుణపడి ఉంటామని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, రామన్నగూడెం గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లికుదురు పెద్ద చెరువు జీవనాడిగా ఉన్న కట్టు కాలువ మరమ్మతు పనులను మంజూరు చేయించి, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న కట్టు కాలువ మరమ్మతుల కలను ఎమ్మెల్యే సాకారం చేయడంతో రైతుల మోముల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయని పేర్కొన్నారు.

ఈ మేరకు మండల కేంద్రం నెల్లికుదురు, రామన్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం కట్టు కాలువ వద్ద కాంగ్రెస్ జిల్లా నేత భూక్య బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు కట్టు కాలువ మరమ్మతుల కోసం పట్టువదలని విక్రమార్కుడిలా రాష్ట్ర మంత్రితో సమాలోచనలు జరిపి నిధులు విడుదల చేయించి, పనులను పూర్తి చేయించిన ఎమ్మెల్యే రైతుల పక్షపాతి అని కొనియాడారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చూపుతున్న ప్రత్యేక చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.

కట్టు కాలువ మరమ్మతులు పూర్తవడంతో పెద్ద చెరువుతో పాటు దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులన్నీ నీటితో నిండి నిండుకుండల్లా మారుతాయని రైతులు తెలిపారు. దీంతో పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. చెరువుల్లో నీరు చేరడంతో పాటు బావుల్లో భూగర్భ జలాలు సైతం పెరిగి, అటు సాగునీటికి, ఇటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇదే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

ఈ కార్యక్రమంలో కాచికల్ సర్పంచ్ ఇట్టె లీలా దేవేందర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ రావుల సతీష్, కుమ్మరికుంట్ల మౌనేందర్, వీరేష్‌తో పాటు నెల్లికుదురు, రామన్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.