భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రామన్నగూడెం పెద్ద చెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులన్నింటికీ ప్రధాన జీవనాడిగా ఉన్న కట్టు కాలువకు ఎమ్మెల్యే డా. మురళి నాయక్ సుమారు రూ.40 లక్షలు మంజూరు చేయించి, పూడికతీత, మరమ్మతు పనులు పూర్తి చేయించారు. దీంతో కట్టు కాలువ నుంచి పెద్ద చెరువుకు నీరు ప్రవహిస్తుండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత బాలాజీ నాయక్, రావుల సతీష్ ఆధ్వర్యంలో రైతులు ఆదివారం కట్టు కాలువ వద్దకు చేరుకుని ప్రవహిస్తున్న నీటికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ.. రైతుల కష్టాలు తీర్చేందుకు ఎన్నికల ముందు ఎమ్మెల్యే మురళి నాయక్ ఇచ్చిన హామీ మేరకు పట్టువదలని విక్రమార్కుడిలా సంబంధిత మంత్రి వద్దకు వెళ్లి సమాలోచనలు జరిపి నిధులు విడుదల చేయించారన్నారు. పనులు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు పూడికతీత, మరమ్మతు పనులను పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేయించారని తెలిపారు. దీంతో కట్టు కాలువ పనులు త్వరగా పూర్తయి ప్రస్తుతం పెద్ద చెరువులోకి నీరు చేరుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కర్షకుల కట్టు కాలువ మరమ్మతుల కల నెరవేరడంతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు తొణికిసలాడుతున్నాయని, ఇందుకు ఎమ్మెల్యే మురళి నాయక్‌కు రుణపడి ఉంటామని రైతులు తెలిపారు. కట్టు కాలువ ద్వారా పెద్ద చెరువుతో పాటు దాని ద్వారా అనేక గొలుసుకట్టు చెరువులు నిండుతాయని, దీంతో వందలాది ఎకరాల సాగు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయని పేర్కొన్నారు.
చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో బావుల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి, అటు సాగునీటికి, ఇటు తాగునీటికి సమస్యలు ఉత్పన్నం కావని రైతులు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులోనూ ఎమ్మెల్యే ఇదే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాచికల్ సర్పంచ్ ఇట్టె లీలా దేవేందర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ రావుల సతీష్, కాంగ్రెస్ మండల యువజన నేత మద్ది రాజేష్, కుమ్మరికుంట్ల మౌనేందర్, వీరేష్‌తో పాటు రెండు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.