భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారీ వర్షంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు, రామన్నగూడెం శివారు ప్రాంతంలో తొర్రూరు–నెల్లికుదురు ప్రధాన రహదారి తెగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తొర్రూరు నుంచి మహబూబాబాద్‌కు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. బస్సులతో పాటు ఇతర వాహనాలు బొడ్లాడ స్టేజి మీదుగా బ్రాహ్మణ కొత్తపల్లి, నెల్లికుదురు మీదుగా జిల్లా కేంద్రం మహబూబాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. తొర్రూరు–మహబూబాబాద్ జాతీయ రహదారి మార్గంలో ప్రస్తుతం రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో వరద నీరు వెళ్లేందుకు చిన్న మెమొరీ ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షం కారణంగా అందులోకి పెద్ద మొత్తంలో నీరు చేరడంతో వరద ఉధృతికి రోడ్డు తెగిపోయింది.
రావిరాల స్టేజి వద్ద రోడ్డుపై భారీ వరద
రావిరాల స్టేజి సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జిపై వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఆదివారం ఉదయం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో తొర్రూరు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాలు కొంతసేపు నిలిచిపోయాయి. ప్రయాణికులు చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. అనంతరం వరద తీవ్రత తగ్గడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
కాగా, రావిరాల గ్రామం నుంచి తొర్రూరు, జిల్లా కేంద్రం మహబూబాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారికి మధ్యలోనే లో లెవెల్ బ్రిడ్జి ఉండటంతో వర్షం నీరు వేగంగా ప్రవహించిన సమయంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామం నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఇదే ప్రధాన రహదారిపై వెళ్లాల్సి ఉండటంతో వరద నీటి ప్రవాహం కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ભારે వర్షాలు కురిసిన ప్రతిసారీ ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటంతో శాశ్వత పరిష్కారం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.