భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ఘనంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ చైర్మన్ పమ్మి సనాతన చారి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న విశ్వకర్మ భగవానుని జయంతి యజ్ఞ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంగా పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.