భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

27న ఛలో యాదగిరిగుట్ట.. తెలంగాణ ఉద్యమకారులు తరలిరావాలి

27న ఛలో యాదగిరిగుట్ట.. తెలంగాణ ఉద్యమకారులు తరలిరావాలి.

భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమకారుల 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ఈ నెల 27న నిర్వహించే ‘ఛలో యాదగిరిగుట్ట’ కార్యక్రమానికి ఉద్యమకారులు భారీగా తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లికుదురులో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 27న యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు చంద్రమౌళి గౌడ్ తెలిపారు. సంఘం ఫోరం వరంగల్ జిల్లా చైర్మన్, ప్రముఖ అడ్వకేట్ నందగిరి రజనీకాంత్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కృషి మేరకు ఈ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ఫోరం ఆధ్వర్యంలో సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలోనూ అదే తరహా వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు.

ఉద్యమకారుల డాటాను సేకరించినప్పటికీ ఇప్పటివరకు వారి సంక్షేమానికి సంబంధించి ఎలాంటి హామీలు ప్రకటించకపోవడం దురదృష్టకరమని చంద్రమౌళి గౌడ్ అన్నారు. ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 27న యాదగిరిగుట్టలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చంద్రమౌళి గౌడ్ వెంట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీరగాని మల్లేశం గౌడ్, మండల అధ్యక్షులు కుమ్మరి కుంట్ల మౌనేందర్ ఉన్నారు.