భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సమక్షంలో పలువురు యువ నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా వరిపల్లి అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యువత, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రూ.5 లక్షల జాబ్ కార్డు అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాజీవ్ యువ వికాసం పథకం అమలులోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ నాయకత్వమే బలమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శంకర్ నాయక్ గెలుపు కోసం యువతను ఏకం చేసి క్షేత్రస్థాయిలో పనిచేస్తామని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు, వ్యవసాయ సమస్యలతో పాటు ప్రజల ఇబ్బందులపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నెల్లుట్ల అజయ్, రవితేజ, బానోత్ జైత్ రామ్, ఆదిత్య, నందు తదితర యువ నాయకులు బీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించారు.