భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ.. రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వారికి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, రోజువారీ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు సమన్వయం, బాధ్యతాయుతమైన పనితీరు, ప్రజల పట్ల మర్యాదపూర్వక వైఖరిని పాటించాలని సూచించారు.
అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేలా ప్రతి అధికారి, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా బిబినగర్ ఎస్‌హెచ్‌ఓ ప్రభాకర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.