భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఎనిమిది మందిని గాయపరిచింది. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సోమవారం రాత్రి ఇనుగుర్తికి చెందిన ఓ తెలుగు దినపత్రిక విలేకరి గంజి వీరేందర్ రెడ్డి, గట్టి గొర్ల సందీప్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పిచ్చికుక్క అకస్మాత్తుగా దాడి చేసి కరిచింది. అలాగే నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వీరయ్య బంధువుల ఇంటికి వచ్చి బయటకు వెళ్లిన సమయంలో ఆయనపై కూడా కుక్క దాడి చేసి గాయపరిచింది.
ఈ క్రమంలో స్థానికులైన భరణి, రాజేష్, రాజు, మల్లన్న, నవీన్‌లను కూడా పిచ్చికుక్క గాయపరిచింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఈఎంటీ ఎలమాద్రి ప్రభాకర్ స్థానికంగా ప్రథమ చికిత్స అందించి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఐదుగురు ఇనుగుర్తి పీహెచ్సీలో చికిత్స పొందారు.