భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

విహారయాత్రలో విషాదం.. స్నేహితుల కళ్ల ముందే..!

విహారయాత్రలో విషాదం.. స్నేహితుల కళ్ల ముందే..!

భారత్ సమాచార్, పోలవరం జిల్లా: విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులోని సోకిలేరు వ్యూ పాయింట్‌ వద్ద వరద ప్రవాహంలో విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నీలేష్‌ గల్లంతయ్యాడు. స్నేహితుల కళ్ల ముందే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో మిగిలిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

హైదరాబాద్‌ నుంచి పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు విహారయాత్ర కోసం చింతూరు, మారేడుమిల్లి ప్రాంతాలకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరుగురు స్నేహితులు సోకిలేరు వ్యూ పాయింట్‌ వద్దకు చేరుకుని స్నానానికి దిగారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో సోకిలేరు ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. నీటి ఉధృతి పెరగడంతో ఆరుగురూ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో నీలేష్‌ సహా కొందరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే నీలేష్‌ మాత్రం వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో నదీ ప్రవాహంలో నీలేష్‌ ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. స్నేహితుడిని కళ్ల ముందే వరద ప్రవాహం తీసుకెళ్లడంతో మిగిలిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వర్షాలు, వరదల నేపథ్యంలో పర్యాటకులు వాగులు, నదీ ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.