భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహించాలి

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను శోభాయమానంగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల అన్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రూట్ మ్యాప్, నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తు, భద్రతా చర్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.

గణేష్ ఉత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే లేదా వివాదాస్పద పోస్టులు, వదంతులు ప్రచారం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

సోదరభావం, పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ కోరారు. ప్రజల సహకారంతో ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, ప్రవీణ్, మల్లేష్, ఆర్‌ఐ రామ్‌నిరంజన్, ఎస్‌ఐలు లింబాద్రి, శ్రీకాంత్, రవీందర్, గోపీ, గణేష్, అశోక్, అజయ్, నర్సయ్య, సాయి సిద్ధార్థ, గఫార్, ఆర్‌ఎస్‌ఐలు రవి, సాయి కృష్ణ, రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.