భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగేలవేడు విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించనున్న విద్యుత్ లోకల్ కోర్టును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఏఈ సాగర్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం (సీజీఆర్‌ఎఫ్-1) చైర్‌పర్సన్ కె. మాధవరావు ఆదేశాల మేరకు ఈ లోకల్ కోర్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, లోపాలు ఉన్న మీటర్ల మార్పిడి, నూతన విద్యుత్ సర్వీసుల మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీస్ పేరుమార్పు వంటి సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చని ఏఈ సాగర్ తెలిపారు.
అలాగే వినియోగానికి మించి అధిక మొత్తంలో వచ్చిన విద్యుత్ బిల్లులు, కేటగిరీ మార్పు, సర్వీస్ రద్దు తదితర విద్యుత్ సంబంధిత సమస్యలను కూడా లోకల్ కోర్టు దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. నెల్లికుదురు, దంతాలపల్లి మండలాల పరిధిలోని వినియోగదారులతో పాటు ప్రస్తుతం ఇనుగుర్తి మండలానికి చెందిన చిన్నముప్పారం వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ లోకల్ కోర్టుకు చైర్‌పర్సన్ కె. మాధవరావు, టెక్నికల్ మెంబర్ ఆర్. శేషారావు, ఫైనాన్స్ మెంబర్ ఎస్. సత్యనారాయణ, ఇండిపెండెంట్ మెంబర్ ఎం. రామారావు హాజరుకానున్నట్లు ఏఈ సాగర్ తెలిపారు.