భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఇనుగుర్తిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాలు, పాఠశాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.

స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బండారి పార్థసారథి, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై పి. నరేష్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రైతు వేదికలో ఏఈఓ భాస్కర్, పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్, హైస్కూల్‌లో ఇన్‌చార్జి హెచ్‌ఎం ప్రవీణ్ పలువురితో కలిసి త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. జాతీయ గీతం జనగణమనతో పాటు జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల బాధ్యులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించేందుకు పాలనను ప్రజల ముంగిటకు తీసుకువచ్చిందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బషీర్, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, దిశా కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్, గోపందాస్ కృష్ణ, నద్దునూరి ప్రశాంత్, దేవులపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.