భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో నూతనంగా ఆవిర్భవించిన ప్రెస్ క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కుంభం మహేందర్ రెడ్డిని మండలంలోని చిన్ననాగారం గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల యువ నాయకులు వడపల్లి సందీప్ గౌడ్, బింగి శరత్ కుమార్ గౌడ్, కార్తీక్ మెడికల్ స్టోర్స్ ప్రొప్రైటర్ జొన్నలగడ్డ కార్తీక్ రెడ్డి, మెడికల్ రిప్రజెంటేటివ్ వైదుగుల సంతోష్ కుమార్ రెడ్డి తదితరులు మహేందర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కుంభం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇనుగుర్తి మండలంలో నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ ప్రజలకు, ప్రభుత్వానికి, వివిధ వర్గాలకు మధ్య సమన్వయానికి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. మండలంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో పాత్ర పోషించాలని కోరారు.
అనంతరం సందీప్ గౌడ్, జొన్నలగడ్డ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రభుత్వాలకు, ప్రజలకు, వివిధ రాజకీయ పక్షాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను మీడియా నిర్వర్తించాలని పేర్కొన్నారు.
విమర్శలు సద్విమర్శల రూపంలో ఉండాలని, వాస్తవాలను ప్రజలకు అందిస్తూ సమాజంలో చైతన్యం తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను వార్తల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రెస్ క్లబ్ కీలక భూమిక పోషించాలని కోరారు. నూతన అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.