భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దివ్యాంగులు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు సహాయ పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగుల కోసం సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. నరేంద్ర మోదీ గత 25 సంవత్సరాలుగా పేద ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నారని గుర్తు చేశారు. దివ్యాంగుల సంక్షేమం, వారి స్వయం ఆధారిత జీవనానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు.
గత ఆరు నెలలుగా జిల్లాలో 461 మంది దివ్యాంగులను గుర్తించి, వారికి 850 సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ వివరించారు. ఈ పరికరాలు దివ్యాంగులకు రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అవసరమైన వారికి సరైన సహాయ పరికరాలు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన గ్లాస్కో క్రీడల్లో దివ్యాంగ క్రీడాకారులు ప్రపంచంలో నాలుగో స్థానం సాధించి, 39 పతకాలను భారత్కు తీసుకువచ్చారని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరికి తక్కువ కాదని, ప్రతిభను చాటుకునేందుకు వారికి సరైన అవకాశాలు, ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని దివ్యాంగులకు సూచించారు.
దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ తెలిపారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే ఇలాంటి సహాయ పరికరాల పంపిణీ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగుల చలనశీలత, వినికిడి సామర్థ్యం, దైనందిన కార్యకలాపాల్లో స్వయం ఆధారితత మెరుగుపడటంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. అవసరమైన దివ్యాంగులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.