భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వనాథ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ చరిత్ర, ప్రజా ఉద్యమాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వనాథ రాజు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఉద్యమంగా నిలిచిందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుల త్యాగాలను నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి యోధుల పోరాటాలు, త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం వారు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చరిత్రను తెలుసుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం యువతపై ఉందన్నారు.
యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. విద్యతో పాటు సామాజిక విలువలు, బాధ్యత, సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. రాఘవేందర్ రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.