భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: త్యాగధనుల పోరాటాలు, అమరవీరుల బలిదానాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నామని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్లో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతం, జాతీయ గేయం, తెలంగాణ రాష్ట్ర గీతాలను విద్యార్థులు, సిబ్బంది శ్రద్ధాభక్తులతో ఆలపించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ రాష్ట్ర స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎందరో వీరులు చేసిన అమూల్యమైన బలిదానాల ఫలితంగానే నేటి స్వేచ్ఛా వాతావరణం సిద్ధించిందని కొనియాడారు.
విద్యార్థులు తమకు లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ సూచించారు. క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, తమ ప్రతిభ ద్వారా సమాజానికి, దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు విద్యతో పాటు బాధ్యత, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను పెంపొందించుకోవాలని అన్నారు.
గతంలో ఈ చారిత్రక దినోత్సవాన్ని అనేక పేర్లతో పిలిచేవారని వీసీ తెలిపారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రోజును ‘ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్లో ఈ వేడుకలను నిర్వహించినట్లు వివరించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ రోజును స్మరించుకోవడం ద్వారా నాటి పోరాటాలు, త్యాగాల గురించి నేటి తరానికి అవగాహన కల్పించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఫ్యాకల్టీ సాగర్, అసోసియేట్ డీన్లు డాక్టర్ ఎస్. విట్టల్, శీలం శేఖర్, డీఎస్పీ ఎం. వెంకట్, డాక్టర్ బి. విజయ్ కుమార్, డాక్టర్ దేవరాజు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ ఫ్యాకల్టీ ఎం. రామకృష్ణ, పీడీలు శ్యాంబాబు, రవి కిరణ్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు దేశభక్తి, తెలంగాణ చరిత్ర, త్యాగధనుల పోరాటాలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.