భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ నుంచి సోమనాథ్, ద్వారకా యాత్రకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఆర్టీసీ డీఎం పండరి తెలిపారు. గురువారం నిర్మల్లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు ఒకే యాత్రలో పలు జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా యాత్రా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో అక్టోబర్ 2న మధ్యాహ్నం ఒంటి గంటకు గుజరాత్లోని జ్యోతిర్లింగం సోమనాథ్కు ప్రత్యేక సూపర్ లగ్జరీ పుష్బ్యాక్ బస్సు బయలుదేరుతుందని డీఎం పండరి తెలిపారు. ఈ యాత్రలో మొత్తం 6 జ్యోతిర్లింగాలతో పాటు 14 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించేలా యాత్రను రూపొందించినట్లు వివరించారు.
యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని అవుందా నాగ్నాథ్, భద్ర మారుతి, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా, శని శింగ్నాపూర్, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం గుజరాత్లోని నిష్కలంక్ మహాదేవ్ మందిర్, సోమనాథ్ జ్యోతిర్లింగం, ద్వారకా, నాగ నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేలా యాత్రా మార్గాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
అలాగే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు మార్గమధ్యలో ఉన్న ఇతర ఆలయాలను కూడా దర్శించుకునే అవకాశం కల్పించినట్లు డీఎం పండరి తెలిపారు. బస్సు అక్టోబర్ 2న నిర్మల్ నుంచి బయలుదేరి అక్టోబర్ 8న తిరిగి నిర్మల్ చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రకు ఒక్కొక్కరికి రూ.8,640 ఛార్జీగా నిర్ణయించినట్లు డీఎం పండరి తెలిపారు. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ తదితర సమాచారం కోసం 9959226003, 9440018549 నంబర్లలో సంప్రదించాలని కోరారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.