భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సృష్టికర్తగా కొలిచే శ్రీ విశ్వకర్మ భగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మానుకోట పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా కొనసాగిన ఈ ర్యాలీలో విశ్వకర్మ జయంతి ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.
విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుద్ర వెంకటేశ్వర్లు విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో నేలకొండ మనీచారి, భాగ్యలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో విశ్వకర్మలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు కేవలం విశ్వబ్రాహ్మణులకే కాకుండా సకల దేవతలకు, సకల మానవాళికి, చేతివృత్తిదారులందరికీ ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించే విశ్వకర్మ జయంతిని కార్మిక దినంగా ప్రకటించి సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే విశ్వబ్రాహ్మణ చేతివృత్తిదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. అనంతరం యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో అన్నదాన వితరణ చేపట్టారు. భక్తులు, విశ్వకర్మ సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ పమ్మి సనాతన చారి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు వంగాల సోమ నర్సయ్య, సొల్లేటి సుదర్శన చారి, వీరభద్రాచారి, చిట్టిమల్ల రఘు, మోత్కూరి శంకర్, ఎర్రోజు కృపాకరాచారి, విజయగిరి వెంకటరాజయ్య, చిట్టోజు రవీంద్ర చారి, బండోజు ఉపేంద్ర చారి, నేలకొండ మనీ చారి, ఆరిందల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మానుకోట జిల్లా, పట్టణ విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విశ్వకర్మ భగవాన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.