భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

వేల ఏళ్ల పురాతన కోనేరుకు పునర్జీవం

తుంగతుర్తి: ఏళ్ల క్రితంనాటి పట్టాభి రామచంద్ర స్వామి పురాతన కోనేరు పునరుద్ధరణ

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో వేల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెప్పబడుతున్న పురాతన కోనేరు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. సంకినేని బ్రదర్స్ సూచనలతో అండెం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను కాపాడటంతో పాటు, పురాతన కోనేరును భక్తులు, గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. దీంతో ఆలయ పరిసరాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు, చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే అవకాశం ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.

తుంగతుర్తిలోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన స్థానిక రాజులు, సంస్థానాధీశుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు స్థానికంగా చెబుతారు. అప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇలవేల్పుగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో శ్రీరాముడు తన పరివారమైన సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామితో కలిసి పట్టాభిషేక మహోత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయం శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.

తుంగతుర్తి: ఏళ్ల క్రితంనాటి పట్టాభి రామచంద్ర స్వామి పురాతన కోనేరు పునరుద్ధరణ

ఆలయ ప్రాంగణ సమీపంలోని పురాతన కోనేరుకు కూడా స్థానిక చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పుష్కరిణి కేవలం నీటి వనరుగా మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్న పవిత్ర స్థలంగా కూడా భావిస్తారు. పూర్వకాలం నుంచి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఇదే పుష్కరిణిలో చక్రస్నానం, వసంతోత్సవాలు నిర్వహించేవారని స్థానికంగా తెలుస్తోంది. పాతకాలపు రాతి కట్టడాలతో నిర్మించిన ఈ కోనేరులోని నీటితో ఆలయానికి వచ్చే భక్తులు గతంలో కాళ్లు, చేతులు కడుక్కోవడంతో పాటు స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్లేవారని ప్రతీతి.

ఈ పురాతన కోనేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాల పెరుగుదలకు కూడా కీలకపాత్ర పోషించిందని స్థానికులు చెబుతున్నారు. ఎండాకాలంలోనూ కోనేరులో నీరు ఊరడం దీని ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. అయితే కాలక్రమేణా సరైన నిర్వహణ లేక కోనేరు శిథిలావస్థకు చేరడంతో పాటు పరిసర ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా మారాయి. ఈ నేపథ్యంలో సంకినేని బ్రదర్స్ సూచనలతో అండెం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురాతన కోనేరు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టడం పట్ల గ్రామ ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పురాతన ఆలయానికి అనుబంధంగా ఉన్న చారిత్రక పుష్కరిణిని పునరుద్ధరించడం ద్వారా ఆలయ ప్రాంగణానికి మరింత శోభ తీసుకురావడంతో పాటు, భక్తులకు మరియు గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ కోనేరు పునరుద్ధరణతో తుంగతుర్తి పట్టాభి రామచంద్ర స్వామి ఆలయానికి మరింత పూర్వ వైభవం చేకూరుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.