భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 218 గ్రాముల డ్రై గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు సిబ్బందితో కలిసి మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో అక్రమంగా డ్రై గంజాయి చాక్లెట్లను కలిగి ఉండటంతో పాటు వాటిని రవాణా చేసి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 218 గ్రాముల డ్రై గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తిని రాహుల్‌గా, తండ్రి పేరు కమలేష్‌గా అధికారులు గుర్తించారు. అతని స్వస్థలం మురేరి, గఢ్వాగా, నివాసం పిప్రైచ్, గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ – 273152గా పేర్కొన్నారు.
మెదక్ జిల్లా ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడి నిర్వహించారు. ఎక్సైజ్ అధికారి జ్ఞానేశ్వర్, నర్సాపూర్ ఎస్‌ఐ శరత్ కుమార్, రవి, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ సందీప్, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఫక్రుద్దీన్, మహేష్ ఈ దాడిలో పాల్గొన్నారు. నర్సాపూర్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టారు.
ఈ ఘటనపై నర్సాపూర్ ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న డ్రై గంజాయి చాక్లెట్లకు సంబంధించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.