భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బాలికా విద్యను ప్రోత్సహించడానికే సైకిళ్ల పంపిణీ: హుస్సేన్ నాయక్

బాలికా విద్య పెంపొందించడానికే సైకిల్స్ పంపిణీ        జాతీయ ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గెయిల్ ఇండియా లిమిటెడ్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిన్న ముప్పారం, కోమటిపల్లి, ఇనుగుర్తి గ్రామాలతో పాటు నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 69 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు.

ఇనుగుర్తి హైస్కూల్ విద్యార్థినులకు 21 సైకిళ్లు, చిన్న ముప్పారం హైస్కూల్ విద్యార్థినులకు 20, కోమటిపల్లి పాఠశాల విద్యార్థినులకు 11, మేచరాజుపల్లి విద్యార్థినులకు 17 సైకిళ్లను హుస్సేన్ నాయక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు సైకిళ్లు అందించి వారి విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం కల్పించారు.

ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పేద కుటుంబాలకు చెందిన అనేక మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఇతర గ్రామాల నుంచి, గిరిజన తండాల నుంచి హైస్కూల్‌కు రావాల్సి ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రయాణ సమస్యల కారణంగా బాలికలు చదువును మధ్యలోనే ఆపివేయకుండా ఉండేందుకు సైకిళ్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలికా విద్య పెంపొందించడానికే సైకిల్స్ పంపిణీ        జాతీయ ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్

బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలను చదువులో ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్తులో విద్యార్థులైన అబ్బాయిలకు సైతం సైకిళ్లు పంపిణీ చేసే విధంగా కృషి చేస్తానని హుస్సేన్ నాయక్ తెలిపారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ బ్యాంకులు, చమురు సంస్థల సహకారంతో ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు అందించడంతో పాటు వివిధ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు స్ప్రే పంపులను కూడా అందజేసినట్లు పేర్కొన్నారు. విద్య, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో పార్థసారథి, ఎంఈవో వెన్న వెంకటరెడ్డి, హెచ్ఎం అమ్మ యాకయ్య, గెయిల్ ఇండియా లిమిటెడ్ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్లభ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు దుంపల సందీప్, జిల్లా కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.