భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం అక్కనపేట గ్రామంలో శుక్రవారం జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఆదిత్య వర్మ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పాడి రైతులు, పశుపోషకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ.. పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధుల నివారణకు సకాలంలో చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. పశువులు సకాలంలో చూలు కట్టేలా రైతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాడి పశువు ఈనిన తర్వాత 90 రోజులలో ఎద లక్షణాలను గుర్తించి గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవడం వల్ల 90 శాతం ఆడ దూడలు జన్మించే అవకాశం ఉంటుందని తెలిపారు. మేలు జాతి లేగ దూడలు జన్మించడం ద్వారా పాడి రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. పుట్టిన లేగ దూడలకు 15 రోజుల వయస్సు నుంచి ఆరు నెలల వరకు నట్టల నివారణ మందులు, ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పాడి రైతులకు సూచించారు.
ఈ ఉచిత పశువైద్య శిబిరంలో గ్రామంలోని 80 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. పశువుల ఆరోగ్య సమస్యలను పరిశీలించి అవసరమైన వైద్య సేవలను అందించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్య సేవలు, కార్యక్రమాలపై అధికారులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మాపూర్ ఎల్‌ఎస్‌ఏ బి. సురేష్, ఎం. రాజు, గోపాలమిత్ర సూపర్‌వైజర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రసాద్, గోపాలమిత్రులు ఎస్. ప్రసాద్, ఎన్. శ్రీనివాస్, ఓఎస్ వెంకట్‌తో పాటు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.