భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఒక్క పంట కాదు.. ఎన్నో ఆదాయ మార్గాలు

ఒక్క పంట కాదు.. ఎన్నో ఆదాయ మార్గాలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ–ఏటీఎంఏ) పథకం ఆధ్వర్యంలో సమైక్య వ్యవసాయం (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్)పై రైతులకు రెండు రోజుల అవగాహన సదస్సు, క్షేత్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి సాగు మెళకువలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆత్మ ఉప పథక సంచాలకులు (డీపీపీడీ) రుద్రమూర్తి, వ్యవసాయ శాఖ ఏడీఏ టెక్ అధికారి విన్సెంట్ వినయ్, ఏడీఏ సోమ లింగారెడ్డి, గ్రామ సర్పంచ్ గట్టు సుశీల, ఉప సర్పంచ్ రంజిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు రైతులతో మాట్లాడి సమైక్య వ్యవసాయ విధానాల ప్రాధాన్యతను వివరించారు. తక్కువ పెట్టుబడితో అధిక, నిరంతర ఆదాయం పొందేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు.

ఒక్క పంట కాదు.. ఎన్నో ఆదాయ మార్గాలు

సమైక్య వ్యవసాయంతో అదనపు ఆదాయం

మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా వ్యవసాయంతో పాటు ఉద్యానవనం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, కుందేళ్ల పెంపకం, వర్మీకంపోస్ట్ వంటి అనుబంధ రంగాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ విధానాన్ని పాటించడం ద్వారా ఏడాది పొడవునా వివిధ మార్గాల్లో నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఒక్క పంట కాదు.. ఎన్నో ఆదాయ మార్గాలు

ఆత్మ డీపీపీడీ రుద్రమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ‘ఆత్మ’ పథకం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా భవిష్యత్తులో సాగు మరింత ప్రయోజనకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.

భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం

ఒక్క పంట కాదు.. ఎన్నో ఆదాయ మార్గాలు

ఏడీఏ వినయ్ మాట్లాడుతూ.. భూసార పరీక్షల ఆధారంగానే పంటలకు అవసరమైన ఎరువులను వినియోగించాలని సూచించారు. సాగులో శాస్త్రీయ నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నీటి వృథాను అరికట్టడంతో పాటు పెట్టుబడి ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని వివరించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ ఆధునిక పద్ధతులను అనుసరించాలని కోరారు.

ఏడీఏ సోమ లింగారెడ్డి మాట్లాడుతూ.. రాయలాపూర్ గ్రామం సమైక్య వ్యవసాయ ఆచరణలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రైతులు అధికారుల సూచనలను పాటిస్తూ సమైక్య వ్యవసాయ విధానాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకునే దిశగా ముందుకు సాగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా భూమగారి వెంకట్ గౌడ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ అమలు చేస్తున్న మిశ్రమ వ్యవసాయ పద్ధతులు, వివిధ ప్రదర్శనలను పరిశీలించి రైతులకు వాటి విధానం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.