భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే సాధారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీ, రాకపోకలను సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, భక్తుల సంఖ్యను లెక్కించే అంశాల్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కలెక్టర్ సూచించారు. చేపట్టే అభివృద్ధి, మౌలిక వసతుల పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులన్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని, పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని బాసరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
అనంతరం పుష్కరాల కోసం బాసరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశం, అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్, సందీప్, అనిల్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్రతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.