భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలనీలో మహిళలు ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న 24 మంది మహిళలకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ఒక మహిళ తులం వెండి బహుమతిని గెలుచుకున్నారు. బహుమతి గెలుచుకున్న మహిళ ఆనందం వ్యక్తం చేస్తూ వెంకటేశ్వర గణేష్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శ్రీ వెంకటేశ్వర కాలనీలో భక్తి వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దామోదర్ రావుతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.