భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు మూల స్తంభం తండాలో పలువురు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తండాలో జ్వరాల పరిస్థితిపై సమాచారం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ తండాను సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా పలువురు గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన సర్పంచ్.. సమస్యను ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న డాక్టర్ సురేష్ వెంటనే స్పందించి, శుక్రవారం మూల స్తంభం తండాలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.
వైద్య శిబిరంలో తండాకు చెందిన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలపై వైద్య సిబ్బంది వివరాలు తెలుసుకుని అవసరమైన వైద్య సేవలు అందించారు. అనంతరం బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తండావాసులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ.. తండావాసులు జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. సమాచారం అందించిన వెంటనే స్పందించి వైద్య సిబ్బందిని పంపించి తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, తండావాసులు పాల్గొన్నారు.