భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి హైస్కూల్ విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ హాజరై విద్యార్థులకు పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. చెత్త ఉత్పత్తి అయ్యే ప్రదేశంలోనే వ్యర్థాలను వేర్వేరుగా విభజించేలా భారత ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని తెలిపారు. ఇందుకోసం నాలుగు రకాల డస్ట్బిన్లను వినియోగించాలని సూచించారు.
ఆకుపచ్చ రంగు డస్ట్‌బిన్‌లో తడి చెత్త, నీలం రంగు డస్ట్‌బిన్‌లో పొడి వ్యర్థాలు, ఎరుపు రంగు డస్ట్‌బిన్‌లో వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వ్యర్థాలు, నలుపు రంగు డస్ట్‌బిన్‌లో గృహాల్లోని విషపూరిత పదార్థాలను వేయాలని వివరించారు. కాలం చెల్లిన మందులు వంటి వాటిని నలుపు రంగు డస్ట్‌బిన్‌లో వేయాలని సూచించారు.
ఈ విధంగా వ్యర్థాలను వాటి స్వభావాన్ని బట్టి వేర్వేరుగా సేకరించి, నిర్వహించినట్లయితే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని సర్పంచి బిక్షపతి గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచి ఇస్లావత్ బాబు, పంచాయతీ కార్యదర్శి రమణ మూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.