భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దివ్యాంగ చిన్నారుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచించారు. దివ్యాంగుల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లోని దివ్యాంగుల భవిత కేంద్రాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఎం. హేమలత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా భవిత కేంద్రంలోని దివ్యాంగ చిన్నారులను జడ్జి ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, శారీరక సమస్యలు, వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవిత కేంద్రం సిబ్బంది, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, వైద్య సేవలు తదితర అంశాలను సమీక్షించారు.
దివ్యాంగ చిన్నారుల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎం. హేమలత సూచించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. దివ్యాంగ చిన్నారుల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దివ్యాంగులకు తమ హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. దివ్యాంగులకు ఏవైనా చట్టపరమైన సమస్యలు ఎదురైతే మండల లీగల్ సర్వీస్ కమిటీ, నర్సాపూర్‌ను ఆశ్రయించవచ్చని జడ్జి తెలిపారు. బాధితులకు అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించేందుకు లీగల్ సర్వీస్ కమిటీ సహకరిస్తుందని పేర్కొన్నారు.
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో నర్సాపూర్ మండల విద్యాధికారి తారా సింగ్, లీగల్ సర్వీస్ న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్, సీనియర్ మహిళా న్యాయవాది సి.హెచ్. స్వరూప రాణి, భవిత కేంద్రం సిబ్బంది పద్మ, లీగల్ సర్వీస్ సిబ్బంది కే. సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం లీగల్ సర్వీస్ పి.ఎల్.సి. కేసులను పరిశీలించారు.