భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

నాగులపల్లి పాఠశాలలో న్యూట్రిషన్ ఫెయిర్

నాగులపల్లి ప్రభుత్వ పాఠశాలలో న్యూట్రిషన్ డే

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నాగులపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పోషణ మాసోత్సవాల్లో భాగంగా శనివారం న్యూట్రిషన్ ఫెయిర్ (పోషకాహార ప్రదర్శన) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోషకాహారం ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన విధానంలో ముఖ్యంగా విద్యార్థులు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల సరైన బరువు పెరగకపోవడం, శారీరక బలహీనత, మానసిక అభివృద్ధిలో లోపాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. “ఆహారం ద్వారానే ఆరోగ్యం” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.

మన పరిసరాల్లో సహజంగా లభించే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం విద్యార్థుల సరైన శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడుతుందని వివరించారు.

నాగులపల్లి ప్రభుత్వ పాఠశాలలో న్యూట్రిషన్ డే

పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు అంగన్‌వాడీ టీచర్ రేణుకతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో “పోషణ ప్రతిజ్ఞ” చేయించారు. ప్రతి కుటుంబంలో పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.

“నో బ్యాగ్ డే” సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు కథలు, పాటలు, కవితలు, పద్యాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో విద్యార్థులు ఉల్లాసంగా గడిపేలా ప్రోత్సహించారు. పోషకాహార ప్రదర్శనలో చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ, రాజు, వెంకటరమణ, స్వర్ణలత, శారద, అనంతరాం గౌడ్, చందర్, ఇషాక్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.