భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండా పరిధిలోని సింగ్య తండాకు చెందిన గుగులోతు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డితో పాటు తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ (టీఏపీటీఏ) ప్రతినిధులు చందర్లాల్ నాయక్, చౌహన్ చిదం ప్రకాష్, వాళ్లలా ముకుందం చేతుల మీదుగా సంతోష్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.
మారుమూల సింగ్య తండాకు చెందిన గిరిజన కుటుంబంలో గుగులోతు వెంకన్న–నమ్కు దంపతుల ప్రథమ కుమారుడిగా జన్మించిన సంతోష్ కుమార్ ప్రస్తుతం హనుమకొండలోని ప్రముఖ విద్యాసంస్థలో ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి చేస్తున్న విశిష్ట కృషిని గుర్తించిన నిర్వాహకులు ఆయనను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
సంతోష్ కుమార్ అందుకున్న జాతీయ పురస్కారంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని అభినందించారు. మారుమూల ప్రాంతం నుంచి ఉపాధ్యాయుడిగా ఎదిగి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.
అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది..
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సంతోష్ కుమార్ మాట్లాడుతూ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని వినమ్రతాపూర్వకంగా తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల అభ్యున్నతికి రెట్టింపు ఉత్సాహంతో కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తనను జాతీయ పురస్కారానికి ఎంపిక చేసిన తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సంతోష్ కుమార్‌కు పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.