భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

పంచభూతాలకు ప్రతీకగా మట్టి గణపతి.. చిన్ననాగారంలో ప్రత్యేక పూజలు

మట్టి గణపతికి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రకృతి స్వరూపుడైన మట్టి గణపతికి భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి. స్టూడెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విఘ్నేశ్వరుడి ఉత్సవాలకు కలమ్మ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పోలోజు హయగ్రీవ చారి, భాగ్యలక్ష్మి దంపతులు రూ.30 వేల విలువైన మట్టి గణపతి విగ్రహాన్ని అందజేశారు.

విఘ్నేశ్వరుడు తన తండ్రి మహాశివుని లింగానికి జలాభిషేకం చేస్తూ, జలధార కురిపిస్తున్న రూపంలో రూపొందించిన ఈ మహా గణపతి విగ్రహాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి నవరాత్రి ఉత్సవాలను స్టూడెంట్ యూత్ సభ్యులు బైరు వినయ్ గౌడ్, మోటపోతుల అభి, బైరు రంజిత్ గౌడ్, మద్దెల బన్నీ గౌడ్, బండారి సాయి గౌడ్, బింగి సిద్ధార్థ గౌడ్, కనుకంటి వంశీ, ఆలకుంట్ల సంతోష్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

మట్టి గణపతికి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు..

మట్టి విగ్రహం పంచభూతాలకు ప్రతీక

మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహం పంచభూతాల ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని విగ్రహాన్ని స్టూడెంట్ యూత్‌కు అందజేసిన దాతలు పోలోజు హయగ్రీవ చారి, భాగ్యలక్ష్మి దంపతులు తెలిపారు. వినాయకుడు మట్టి నుంచే జన్మించాడని, పార్వతి దేవి నలుగు పిండితో గణపతికి ప్రాణం పోసిందని వారు పేర్కొన్నారు.

మట్టితోనే పుట్టి తిరిగి మట్టిలోనే కలుస్తామనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు బోధిస్తుందని తెలిపారు. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటిలోని జీవులకు ఎలాంటి హాని జరగదని, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లదని అన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని స్వామివారి మట్టి విగ్రహ ఏర్పాటుకు తాము చేయూతనిచ్చినట్లు దాతలు తెలిపారు.