భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం బడి తండాలో గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపిస్తూ తండాకు చెందిన బానోత్ శ్రీకాంత్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్కు ఫిర్యాదు పత్రం అందజేశారు.
బడి తండా సర్పంచ్, ఉపసర్పంచ్లు చేపట్టిన పనులకు వాస్తవ ఖర్చు కంటే ఎక్కువ మొత్తంలో నిధులు డ్రా చేసినట్లు శ్రీకాంత్ ఆరోపించారు. బడి తండా శివారులోని రేగడి తండా వరకు రహదారి కోసం కేవలం 100 ట్రిప్పుల మొరం మట్టి పోసి రూ.4.50 లక్షలు డ్రా చేసినట్లు ఆయన ఆరోపించారు.
అదేవిధంగా వరంబండ తండా దారిలో ఉన్న ముళ్ల కంప చెట్లను తొలగించేందుకు జేసీబీ యంత్రాన్ని కేవలం 10 గంటలు వినియోగించినప్పటికీ రూ.1.10 లక్షల నిధులు తీసుకున్నట్లు శ్రీకాంత్ ఆరోపించారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.