భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేటను నియోజకవర్గ కేంద్రంగా పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టు గంగారం కోరారు. రామాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ డిమాండ్‌ను వెల్లడించారు.
రామాయంపేటను మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి
గతంలో రామాయంపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్న సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా రద్దయిన విషయం అందరికీ తెలిసిందేనని మెట్టు గంగారం తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రద్దయిన రామాయంపేట నియోజకవర్గాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరుతున్నట్లు చెప్పారు.
ఐదు మండలాలతో నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్
రామాయంపేట, శంకరంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట మండలాలను కలిపి రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తమ డిమాండ్ గొంతెమ్మ కోరిక కాదని, రామాయంపేట ప్రాంత అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ పునరుద్ధరణ అవసరమని పేర్కొన్నారు.
అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం
1952 నుంచి 2009 వరకు కొనసాగిన రామాయంపేట నియోజకవర్గాన్ని మధ్యలో తొలగించడం వల్ల ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని మెట్టు గంగారం అన్నారు. ఇప్పటికైనా రామాయంపేటను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలంటే నియోజకవర్గాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ విషయంలో అడ్డంకులు ఎదురైతే ఎంతటి త్యాగానికైనా, ఎలాంటి పోరాటానికైనా వెనుకాడేది లేదని ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా ఈ పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తామని మెట్టు గంగారం పేర్కొన్నారు.