భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మహబూబాబాద్‌కు మరో టూరిజం స్పాట్.. ఈదులపూసపల్లి చెరువు

మహబూబాబాద్‌కు మరో టూరిజం స్పాట్.. ఈదులపూసపల్లి చెరువు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ ప్రజలకు ఈదుల పూసపల్లి చెరువు అద్భుతమైన విహార స్థలంగా మారుతోందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఆయన మంగళవారం ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు, పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు.

170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధి

అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చేపడుతున్న పర్యాటక అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కొనియాడారు. ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే మహబూబాబాద్ ప్రజలకు ఆహ్లాదకరమైన విహార స్థలంగా మారుతుందని అన్నారు.

పర్యాటకులకు సకల సౌకర్యాలు

మహబూబాబాద్‌కు మరో టూరిజం స్పాట్.. ఈదులపూసపల్లి చెరువు

చారిత్రాత్మక కాకతీయుల కాలం నాటి ఈదుల పూసపల్లి చెరువు చుట్టూ గుట్టలు, అందమైన దీవులు ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని రవీందర్ రావు తెలిపారు. ఇక్కడ యోగా కేంద్రాలు, అందమైన పూల వనాలు, వాకింగ్ ట్రాక్, కుటుంబ సభ్యులతో రోజంతా గడిపేందుకు వీలుగా కూర్చునే బెంచీలు, డైనింగ్ హాల్స్‌తో పాటు నాలుగు అంతస్తుల వాచ్ టవర్ తదితర నిర్మాణాలను అటవీ శాఖ చేపట్టిందని చెప్పారు.

ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతం ‘నభూతో నభవిష్యత్’ అనే రీతిలో అద్భుతంగా ఉందని ఎమ్మెల్సీ అభివర్ణించారు.

మ్రానుకోట చారిత్రక నేపథ్యం

మహబూబాబాద్‌కు గతంలో ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కూడా ఎమ్మెల్సీ గుర్తుచేశారు. పూర్వం అడవులు, చెట్ల మధ్య ఉన్న ఊరు కావడంతో దీనికి ‘మ్రానుకోట’ అనే పేరు ఉండేదని, కాలక్రమంలో అది మానుకోటగా, ఆ తర్వాత మహబూబాబాద్‌గా మారిందని తెలిపారు. మ్రానుకోట అసలు రూపాన్ని ఈ అటవీ ప్రాంతంలో చూడగలుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

మహబూబాబాద్‌కు మరో టూరిజం స్పాట్.. ఈదులపూసపల్లి చెరువు

మినీ జూ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన

ఈ ప్రకృతి వనాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలని కోరుతూ అటవీ శాఖ డీఎఫ్‌ఓతో సమావేశం కానున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పిల్లలకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు ఈదుల పూసపల్లి వద్ద గానీ, లేదా అద్భుతంగా రూపుదిద్దుకున్న జమాలపల్లి ప్రకృతి వనం వద్ద గానీ ‘మినీ జూ పార్క్’ ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు వెల్లడించారు.

జిల్లా కేంద్రంగా సర్వతోముఖాభివృద్ధి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ఇప్పటికే మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

మహబూబాబాద్‌కు మరో టూరిజం స్పాట్.. ఈదులపూసపల్లి చెరువు

వందలాది మంది ఉద్యోగులు, వేలాది మంది విద్యార్థులతో జిల్లా కేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో చుట్టూ రింగ్ రోడ్డు, అనుసంధాన రహదారుల నిర్మాణం చేపట్టి మహబూబాబాద్‌ను మరింత వేగంగా అభివృద్ధి చేసి, ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దాలని కోరారు.

వారాంతాల్లో కుటుంబంతో కలిసి సందర్శించాలని విజ్ఞప్తి

మహబూబాబాద్ ప్రజలు వారాంతాల్లో శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఈదుల పూసపల్లి, జమాలపల్లి ప్రకృతి వనాలను తప్పక సందర్శించాలని ఎమ్మెల్సీ కోరారు. ఇంటి వద్దే భోజనం వండుకుని వచ్చి ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడపాలని సూచించారు.

ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు కూడా తమ సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. ప్రజాప్రతినిధులుగా మహబూబాబాద్‌కు మరింత వన్నె తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు స్పష్టం చేశారు.