భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మామునూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా పాలనకు ఆద్యుడైన సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని గౌడ యువజన సంఘం ఇనుగుర్తి మండల అధ్యక్షుడు మద్దెల సుధాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గోల్కొండ ప్రజల ఆత్మగౌరవం కోసం 350 ఏళ్ల క్రితమే నైజాం నియంతృత్వ ముస్లిం పాలకులను ఎదురించి, గోల్కొండలో ప్రజారాజ్యానికి శ్రీకారం చుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న పేరు మామునూరు విమానాశ్రయానికి పెట్టడం అన్ని విధాలా సముచితమని ఆయన పేర్కొన్నారు.
పాపన్న చరిత్రను గుర్తు చేసిన సుధాకర్ గౌడ్
ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని ఖిలాషాపూర్లో సాంప్రదాయ గౌడ కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్, తురక పాలకులపై సింహంలా గర్జించారని సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను వంచిస్తూ ధన, ప్రాణ, మానాలను దోచుకుంటున్న నైజాం దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా పాపన్న తన మిత్రులతో కలిసి ప్రజలకు పోరాటానికి పిలుపునిచ్చి యుద్ధం చేశారని తెలిపారు. అనంతరం గోల్కొండను పాలించిన పాపన్న పేరు మామునూరు విమానాశ్రయానికి పెట్టడం చారిత్రక నిర్ణయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అన్ని వర్గాల ఆత్మగౌరవానికి గుర్తింపు
సమసమాజ పాలనకు నాంది పలికిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు విమానాశ్రయానికి పెట్టినట్లయితే బహుజనులతో పాటు అన్ని వర్గాల ఆత్మగౌరవానికి తగిన గౌరవం ఇచ్చినట్లవుతుందని సుధాకర్ గౌడ్ అన్నారు. అంతేకాకుండా పాపన్న చరిత్రకు అంతర్జాతీయంగా మరింత ప్రఖ్యాతి లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టే విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చొరవ చూపాలని మద్దెల సుధాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.